బీజేపీతో సంబంధం లేదని జగన్ అనగలరా?: కాంగ్రెస్

ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా ఊమెన్ చాందీ బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఏపీ అంతటా తిరుగుతూ గతంలో పార్టీ నుంచి దూరమైన నేతలను మళ్లీ సొంతగూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కార్యకర్తల్లోనూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాపులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లను పక్కన పెట్టేసిందని గుర్రుగా ఉన్న కాపు నేతలు, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్ల ఆకాంక్ష నెరవేరుతుందనుకున్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యలతో కాపు నేతలు సందిగ్ధంలో పడ్డారు.

ఈ అవకాశాన్ని తమ వైపు మలుచుకోవాలని కాపు వర్గం ఓట్లను దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే కాపు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కాపులకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. 2019 ఎన్నికల్లో కాపులకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యమిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీతో తనకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించగలరా అని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలకు ఇస్తే రాష్ట్రానికి పత్యేక హోదా తెస్తామంటున్న జగన్.. కాపు రిజర్వేషన్లపై ఎందుకు హామీ ఇవ్వలేరని ఏపీసీసీ చీఫ్ రఘువీరా ప్రశ్నించారు. గతంలో రాహుల్, సోనియా చెప్పినట్లుగా కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రఘువీరా అన్నారు.