బీజేపీ మోసాన్ని ఎండగట్టండి: చంద్రబాబు

ఈరోజు ఉదయం పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపైనా భాజపా మోసాన్ని ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటన్న విషయం అఫిడవిట్లలో తేలిపోయిందని.. కేసుల మాఫీపై తప్ప జగన్ దృష్టి మరి దేనిపైనా లేదని విమర్శించారు. రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్నందున…, రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చే అంశంపై ఒత్తిడి పెంచాలని దిశానిర్థేశం చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ముస్లిం మైనారిటీలు భాజపాకు పూర్తిగా దూరమయ్యారని.. అలాంటి బీజేపీతో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒంగోలు ధర్మపోరాట సభ విజయవంతమైందని…, ప్రజల స్పందన ఎలా ఉందో అంతా గమనించారని సీఎం చెప్పారు.