భీమవరం నుంచి పోటీ చేయనున్న జనసేన అధినేత?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనికోసం ఆయన 15 రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 23న భీమవరం చేరుకున్న పవన్ జిల్లాలో పర్యటించేందుకు అక్కడి ముఖ్య నేతలతో చర్చించారు. కొన్ని రోజుల పాటు జిల్లాలోనే ఉంటూ వచ్చే ఎన్నికల ప్రణాళికలపై పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు అక్కడే ఉండి జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్.

20 ఏళ్లుగా భీమవరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఎవరిని గెలిపించినా వారి స్వార్థం కోసమే తప్ప ఊరి ప్రజల కోసం ఏమీ చేయడం లేదనేది వారి భావన. వాళ్ల వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు తప్ప ఊరికి ఏమీ చేయలేదని ప్రజల నిరాశతో ఉన్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా పవన్‌కు అండగా ఉండేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మైనారిటీ వర్గాలు మొన్నటి వరకు వైసీపీ వైపు మొగ్గు చూపినా.. పవన్ పర్యటన తర్వాత జనసేన వైపు అడుగులు వేస్తున్నారు. చిరంజీవి కుటుంబం సొంత జిల్లా కావడంతో ఇక్కడి నుంచే జనసేన పునాదులు బలపరిచేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను స్వీప్ చేయాలనే విధంగా ఇక్కడి నుంచే జనసేన పావులు కదుపుతోంది.

ప్రస్తుత ఎమ్మెల్యే రామాంజనేయులు పులపర్తి(అంజిబాబు) పై కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా ఊరికి ఏమీ చేయలేదనే ప్రజలు గత ఎన్నికల్లో అంజిబాబును గెలిపించామనేది ప్రజల భావన. ఈ సారి వీరిద్దరూ పోటీలో ఉన్నా పవన్ గనుక పోటీకి దిగితే కచ్చితంగా గెలిపించి తీరుతామని పవన్ ను ఎలాగైనా భీమవరం నుంచి పోటీ చేయించాలని సేనలు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు మంచి పట్టు లభించే అవకాశముందని భావిస్తున్నారు.

ఈ మధ్య భీమవరంలో జరిగిన పవన్ బహిరంగ సభకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. రెండు మూడు రోజులు మాత్రమే ఉండాలనుకుని వచ్చాను.. భీమవరాన్ని అర్ధం చేసుకోవాలంటే మరో 10 రోజులున్నా కూడా సరిపోదు. అంత క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలని పవన్ అన్నారు. గోదావరి జిల్లా తన తాతగారిదైనా తాను అక్కడ పెరగలేదని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందంటూ వ్యాఖ్యానించారు. చుట్టూ నీరున్నా తాగడానికి చుక్క నీరు లేదని అంతా ఉప్పుమయం అని అన్నారు. దీనిపై ఆలోచించే వారు ఎవరూ లేరని, కానీ దేశమంతా ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అంటూ ముక్త కంఠంతో అరుస్తున్నారని వ్యాఖ్యానించారు.

భీమవరంలో ఒక డంపింగ్ యార్డు కూడా లేక నదీ జలాలు కలుషితమవుతున్నాయని పవన్ అన్నారు. మనం ఓట్లేస్తే గెలిచిన బీజేపీ అభ్యర్థి డంపింగ్ యార్డుకు ఇప్పటికీ స్థలం చూడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు పశ్చిమగోదావరి ప్రజలను టీడీపీ వదిలేసిందని విమర్శించారు. మేం పెద్ద కుటుంబీకులం కాదు.. మాకు వేల కోట్లు లేవు.. మా తాతయ్య పెనుగొండలో చిన్న పోస్ట్ మాన్, మా నాన్న ఓ కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించారు. మా పూర్వీకుల మూలాలు ఇక్కడే ఉన్నాయి. అలాంటి పశ్చిమగోదావరి జిల్లాను నేను ఎప్పటికీ మరిచిపోనని పవన్ అన్నారు. పశ్చిమగోదావరిని నా గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.

నాకు రాజకీయ అనుభవం కంటే కూడా ప్రజల కేదో చేయాలనే ఆకాంక్ష, ఆశయాలు బలంగా ఉన్నాయన్నారు. నేను వచ్చింది ఎన్నికల కోసం 25 ఏళ్ల పాటు ఇక్కడి యువత ఆకాంక్షలను, ఆశయాలను నిలబెట్టడం కోసం వచ్చానని పవన్ ఆవేదనతో అన్నారు. జనసేన అంటే కేవలం ప్రశ్నించడమే కాదు.. అధికారాన్ని స్థాపించే పార్టీ అన్నారు. అనుభవం కోసం ఇన్నాళ్లూ పోటీ చేయలేదని, శక్తి లేకో.. స్థాయి లేకో కాదని అన్నారు. దశాబ్ధ కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న జనసేన 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ అన్నారు.

యనమదురు డ్రైన్ చూస్తే టీడీపీ అవినీతి వాసన, వైసీపీ దోపిడీ గుర్తుపెట్టుకోవాలని పవన్ అన్నారు. వైఎస్ హయాంలో మంచినీటి ప్రాజెక్టు కోసం 60 ఎకరాలు 12 లక్షలకు తీసుకున్నారు. భీమవరం పట్టణానికి, చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి ప్రాజెక్టు రాలేదని.. భూములు రైతుల చేతుల్లోంచి వెళ్లిపోయాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఈ అంశం లేవనెత్తితే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తారని వారి మనుషులు చెప్పారు. కోటిన్నర ఇస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తామని ట్విస్ట్ పెట్టారు. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ కోటిన్నర ఇదే దోపిడీ చాలా అందమైన దోపిడీ అని పవన్ అన్నారు. ఇప్పటి వరకూ ఎంతోమంది ఎఁపీలు, ఎమ్మెల్యేలు వచ్చారు.. కానీ నా తండ్రులు, తాతలు ఇక్కడి నుంచి వచ్చిన వారు నేను మీకు అండగా నిలబడతానని పవన్ ఆవేశంగా అన్నారు. 15సీట్లిచ్చిన పశ్చిమగోదావరికి, భీమవరానికి టీడీపీ కనీసం డంపింగ్ యార్డ్ చేయలేకపోయిందని విమర్శించారు.