‘భైరవగీత’ ట్రైలర్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిర్మిస్తున్నచిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రంలో ధనుంజయ, ఇర్రా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ కూడా వర్మతో చేయి కలిపింది. వర్మ శిష్యుడు సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను వర్మ ఈ రోజు (శనివారం) తన సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. కన్నడ ట్రైలర్‌ను సాండల్‌ వుడ్‌ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ రిలీజ్‌ చేశారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించినట్లు ప్రచార చిత్రంలో చూపించారు. ఈ ట్రైలర్‌ను వర్మ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హత్యలు, రక్తపాతాన్ని విపరీతంగా చూపించారు. ‘భైరవగీత’ దర్శకుడు సిద్ధార్థ అయినా.. ఇది వర్మ మార్కు సినిమాలాగే ఉంది.

‌’మనం సంపమంటే సంపనీకి.. మన కోసం సావనీకి కాకుంటే వాళ్ల బతుకులు యాదానికనుకుంటున్నావు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. తన ప్రేమను కాపాడుకునేందుకు సమాజాన్ని ఎదిరించే వ్యక్తిగా కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘ఎవర్నీ ఇడిసిపెట్టొద్దు.. ఏడిపిద్దాం.. ఒక్కొక్కర్నీ సంటిపిల్లల్లా గుక్కపట్టి ఏడ్చేలా చేద్దాం.. వాళ్ల రక్తంతో ఈ సీమకు అభిషేకం చేద్దాం’ అని చివర్లో హీరో చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు.