మగధీర సీరిస్‌ పనుల్లో రాజమౌళి?

బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా మగధీర. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాసింది. పునర్జన్మల నేపథ్యంలో ఫాంటసీ కథాశంతో తెరకెక్కిన మగధీర సినిమా రాజమౌళిని టాప్‌ డైరెక్టర్‌గా నిలిపింది. 2009లో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

మగధీర కేవలం తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకున్న సినిమా కావడంతో దక్షిణాది భాషల్లో మినహా ఇతర భాషల్లోకి అనువాదించలేదు. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లోనూ విడుదలైనా ఇంగ్లీష్, స్థానిక భాషల సబ్‌టైటిల్స్‌తో మాత్రమే ప్రదర్శించారు. పైగా, అప్పట్లో రాజమౌళికి అంత క్రేజ్ కూడా లేదు. జపాన్‌లో బాహుబలి సీరిస్‌కి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

అందుకే ఇప్పుడు మగధీర సినిమాను కూడా జపనీన్‌ భాషలతో డబ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు జపాన్‌లోనూ మారుమోగిపోయింది. అందుకే మగధీరను డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్‌ వస్తుందని భావిస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.