‘మణికర్ణిక’ నుంచి తప్పుకున్న సోనూసూద్‌

ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఝాన్సీ పాత్రలో కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. కంగన, క్రిష్‌ మధ్య గొడవలు వచ్చాయని, అందుకే కంగన దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత వీటి గురించి స్పందిస్తూ.. క్రిష్‌ వేరే చిత్రంతో బిజీగా ఉండడంతో కొన్ని సన్నివేశాలు తాను తెరకెక్కించాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి సోనూసూద్‌ తప్పుకొన్నారు. ఇందులో ఆయన సదాశివ్‌ అనే మరాఠా రాజు పాత్రలో నటించాల్సి ఉంది. ఆయనపై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందనగా సోనూ సినిమా నుంచి వైదొలగారు. ఈ విషయాన్ని కంగన మీడియా ద్వారా వెల్లడించారు. తనతో నటించడం ఇష్టంలేకే సోనూ తప్పుకొన్నారని ఆరోపిస్తున్నారు. ‘నాలాంటి మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం సోనూకు ఇష్టంలేదు. అందుకే ఆయన సినిమా నుంచి వైదొలగారు. నేను సోనూను తక్కువచేసి చూశానని వార్తలు వెలువడుతున్నాయి. నేను సోనూను ఇప్పటివరకు ఒక్కసారి కూడా కలిసిందిలేదు. ఆయన్ను డైరెక్ట్‌ చేసింది లేదు. అలాంటప్పుడు నేను ఆయన్ని తక్కువ చేసి చూశానని ఎలా అంటారు? సినిమాలో ఆయన సన్నివేశాలను ఆయనే రాసుకున్నారు. కానీ, స్క్రిప్ట్‌లో ఆయన రాసుకున్న సన్నివేశాలు లేవు. క్రిష్‌తో కలిసి సోనూ స్క్రిప్ట్‌లో లేని సన్నివేశాలను చాలానే తెరకెక్కించారు. అది రచయితలకు నచ్చలేదు. అది నా తప్పా? సినిమా కథను నేను రాశానా? పాత్ర కోసం సోనూ నాలుగు నెలల పాటు కసరత్తులు చేశారు. తాను తెరకెక్కించుకున్న సన్నివేశాలను తొలగించవద్దు అని రచయితలను కోరారు. నా వెనక ఇంత జరుగుతోందని నాకేం తెలుసు? ఈ సన్నివేశాలు చూసి రచయితలు తమకు నచ్చలేదని చెప్పారు. నేను మణికర్ణిక చేతిలో కేవలం బానిసను. లక్ష్మీబాయి కోసమే ఇంత కష్టపడుతున్నాను. ఈ విషయం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. అని వెల్లడించారు కంగన.