‘మణికర్ణిక’ నుంచి తప్పుకొన్న నిర్మాత ..!

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సినిమాకు కథ అందించారు. మొదటిగా ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తరువాత ‘యన్టీఆర్‌’ బయోపిక్‌తో బిజీ అయిన క్రిష్ ఆ బాధ్యతల్ని కంగనకు అప్పగించారు. ఆమె ఇప్పుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క సెట్‌లో కంగన తీరు నచ్చక నటుడు సోనూసూద్‌ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఆమెకు దర్శకత్వం వహించే అర్హత, అనుభవం లేదని ఆయన మీడియాతో అన్నారు.

కాగా, ఈ ప్రాజెక్టు నుంచి నిర్మాత సంజయ్‌ కుట్టి కూడా తప్పుకొన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పుడు ప్రాజెక్టును కొత్త నిర్మాతలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ కారణాల వల్ల షూటింగ్‌ వాయిదాలు పడటంతో బడ్జెట్‌ పెరిగిన కారణంగా నిర్మాతలు ప్రాజెక్టును వద్దు అనుకున్నట్లు తెలుస్తోంది. రూ.70 కోట్లతో అనుకున్న బడ్జెట్‌ ఇప్పుడు రూ.100 కోట్లు అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ‘మణికర్ణిక’ చిత్రంలో అతుల్‌ కులకర్ణి, సురేశ్‌ ఒబెరాయ్‌, అనిత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హిందీతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.