మరోసారి ఏఎన్నార్‌గా..చైతూ!

‘మహానటి’ చిత్రంలో తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు నాగచైతన్య. దీనిపై నాగార్జున స్పందిస్తూ..తన తండ్రి పాత్రలో నటించే అవకాశం ఇప్పటివరకు తనకు దక్కలేదని బాధపడ్డారు కూడా. అయితే ఇప్పుడు మరోసారి తాతగారి పాత్రలో నటించే అవకాశం చైతూకు దక్కినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. సమాన ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఎన్టీఆర్‌ కెరియర్లో అక్కినేని పాత్ర కనిపించి తీరుతుంది. అందుకే ఏఎన్నార్‌ పాత్రకు నాగచైతన్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘మహానటి’ చిత్రంలో నాగేశ్వరరావు పాత్రలో చైతూ నటన చూసి క్రిష్‌ ఇంప్రెస్‌ అయ్యారట.