మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుత ఆకుపచ్చ తెలంగాణ చేస్తా

త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం. ఉద్యోగాలలో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోడీని నిలదీసి తెచ్చుకున్నాం. కేసీఆర్‌ సీఎంగా లేకపోతే 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ సాధ్యమయ్యేదా. ఇది యువత పట్ల టీఆర్‌ఎస్‌కు ఉన్న నిబద్ధత. కేసీఆర్‌ని గద్దె దించడమే లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇదేమి దిక్కుమాలిన లక్ష్యం. ఏదైనా మంచి పని చేస్తామని ప్రజలకు చెప్పండని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

కొంగరకలాన్‌లో తెరాస ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. “ముందస్తు ఎన్నికలు వస్తాయి.. ప్రభుత్వం రద్దు అవుతుందని మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం మా మంత్రివర్గ సహచరులకు చెబితే.. తెలంగాణ ప్రజలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోమని చెప్పారు. కొత్త పథకాలు ప్రకటిస్తారని మీడియాలో రాశారు. సీఎం హోదాలో ఉండి ప్రకటించడం మంచి పద్ధతి కాదు. త్వరలో కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ వేసి రూపొందిస్తామని కేసీఆర్ అన్నారు.

“ఎన్నికలకు ముందే కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తాం. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఇసుకపై వచ్చిన లాభం రూ.9 కోట్లు మాత్రమే. టీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వానికి రూ.1,980కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచి.. సంపదను ప్రజలకు పంచుతాం. మీరు అధికారం ఇస్తే, ఎంత గొప్పగా ప్రభుత్వాలు పనిచేయవచ్చో మీకు అమలు చేసి చూపించాను. మళ్లీ ప్రజలు దీవిస్తే, అద్భుతమైన కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ, సమూలంగా పేదరికం నిర్మూలించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడం, వీటన్నింటినీ భగవంతుడి దయ వల్ల సాధించి పెడతానని అందుకు మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నా. రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాయి. ఆ కార్యచరణ అంతా సందర్భానుసారంగా ప్రకటిస్తానని మనవి చేస్తున్న” అని కేసీఆర్ వెల్లడించారు.

భూ రికార్డులు ప్రక్షాళన చేసి వాటి ఆధారంగా రైతు బంధు, రైతు బీమా పథకం అమలు చేస్తున్నాం. రెండో పంట డబ్బులు నవంబరులో వస్తాయి. తెరాస ప్రభుత్వం ఉన్నంతకాలం, రైతులు ధనవంతులయ్యే వరకూ రైతు బంధు పథకం కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌ ఉన్నంతకాలం రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ అన్నారు.