మళ్ళీ నటిస్తానంటున్న మనీషా

‘వళక్కు ఎన్‌ ‘ బాలాజీ మెహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది నటి మనీషా యాదవ్‌. ఆ తర్వాత సుశీంద్రన్‌ దర్శకత్వంలో ‘ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌ వీర్‌’,’జన్నల్‌ఓరం’,’పట్టయ కిలప్పనుం పాండియా’ చిత్రాల్లో నటించారు. ‘చెన్నై 28’ రెండో భాగంలో ఓ పాటకు చిందులేశారు. వీటిలో ‘ఆదలాల్‌ కాదల్‌ సెయ్‌వీర్‌’ మంచి గుర్తింపునిచ్చింది. అయితే ఐటం సాంగ్‌లో నటించడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అవకాశాలు తగ్గడంతో ఆమె తన ప్రేమికుడిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టారు.

పెళ్లికి ముందు ఆమె నటించిన చివరి చిత్రం ‘ఒరు కుప్ప కదై’ అప్పట్లో పలు కారణాలతో విడుదల కాలేదు. కానీ మూడేళ్ల తర్వాత తాజాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఓ చిన్నారికి తల్లిగా నటించింది మనీషా. ఇందులో ఆమె నటనకు విశ్లేషకుల నుంచి మన్ననలు అందుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు ఫోన్‌చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో మళ్లీ నటించాలని నిర్ణయించుకుంది మనీషా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒరు కుప్ప కదైలో నా నటనను చూసి చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ముందుగానే విడుదలై ఉంటే నటనను కొనసాగించేదాన్ని. ఆలస్యమైనప్పటికీ.. నా సినీ జీవితానికి పునరుత్తేజాన్ని కలిగిస్తోంది. పెళ్లి తర్వత కూడా నటించాలనే ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ‘నీకు ఇష్టమైతే తప్పకుండా నటించు’ అని నా భర్త స్వేచ్ఛనిచ్చారు. మంచి కథా చిత్రాలను ఎంచుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తా. ప్రస్తుతం పలు కథలను వింటున్నానని పేర్కొన్నారు మనీషా యాదవ్‌.