‘మా’ లో నిధుల దుర్వినియోగం వాస్తవమే: నరేశ్

సోమవారం ‘మా’ కార్యాలయంలో ‘మా’ జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ నటుడు నరేశ్‌. విలేకరులతో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించారు. ‘మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తాను ఎవరిపై ఫిర్యాదు చేయాలనుకోవడం లేదని.. కానీ ధర్మం కోసం పోరాడక తప్పదని పేర్కొన్నారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేశ్‌.. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు. తన తల్లి విజయ నిర్మల పుట్టిన రోజున ‘మా’ కు ఏటా రూ.75వేలు ఇస్తున్నారని అన్నారు. ఇప్పటివరకూ ఆమె రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారని అన్నారు. మా సభ్యులు బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌తో అమెరికా వెళ్లడం దారుణమన్నారు. ‘మా’ నిధుల గోల్‌మాల్‌పై మీడియాలో వార్తలు వచ్చినప్పటి నుంచి శివాజీరాజా కనిపించడం లేదన్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నందుకే తన అభిప్రాయం వినడం లేదన్నారు.

‘మా’ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్‌ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ… ఆయనకు సంబంధించిన కాల్‌, మెసేజ్‌ డాటాను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు. నటి శ్రీరెడ్డి విషయంలో ‘మా’  తీసుకున్న నిర్ణయం కూడా తనకు నచ్చలేదన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ‘మా’ కు చేటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.