“యాత్ర” చేయబోతున్న అనసూయ

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీ మహా విజయం తర్వాత యువ దర్శకులంతా ఇప్పుడు ఆ వైపుగా దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సంజయ్‌దత్ బయోపిక్ సంజు కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది.

టాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న మరో బయోపిక్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్న “యాత్ర” మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్, శశి నిర్మిస్తున్నారు. కాగా ఈచిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో చేయనున్నట్టు సమాచారం. కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలి పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రామ్‌చరణ్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఇంకా ఈ చిత్రంలో సుహాసిని, రావు రమేష్ కూడా ఇతర పాత్రల్లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.