రాఘవేంద్రరావు కొడుకు ‘మెంటల్ హై క్యా’!

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలమూడి తొలి నుంచి డిఫరెంట్ చిత్రాలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో అనగనగా ఒక ధీరుడు, సైజ్‌ జీరో సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్‌ కోవెలమూడి. దర‍్శకేంద్రుడు రాఘవేంద్రరావు వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ప్రకాష్ కమర్షియల్ సక్సెస్‌ లు సాధించలేకపోయినా.. విభిన్న చిత్రాలతో తన మార్క్‌ చూపిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గతంలో మార్నింగ్‌రాగా అనే జాతీయ స్థాయి చిత్రంతో ఆకట్టుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
విలక్షణ నటుడు రాజ్‌ కుమార్‌ రావ్, స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కీలక పాత్రల్లో మెంటల్‌ హై క్యా.? అనే సినిమాను రూపొందిస్తున్నాడు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాను బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.