రాజకీయాలా? సినిమా? పవన్ క్లారిటీ..

ఏపీలో అధికారం ఎవరిది? అయితే టీడీపీది.. లేదంటే వైసీపీది.. ఈ రెండు పార్టీలపై అందరి దృష్టి నెలకొంది. మరి మధ్యలో వచ్చిన జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి అధికారం రాదు సరే.. మరి ఎన్ని సీట్లు సాధిస్తుంది.? తక్కువ వస్తే పవన్ రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా వైదొలుగుతారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం జనసైనికుల్లో వ్యక్తమవుతున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం చేపట్టకపోయినా జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. ఏదైనా ఒక మార్కును చూపిస్తానని తాజా మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే తగినన్ని సీట్లు రాకపోతే మళ్లీ టాలీవుడ్ బాట పట్టి సినిమాలు తీస్తాడా అన్న ప్రశ్న  ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.
అయితే తాజాగా పోలింగ్ సరళిపై జనసేన కీలక నేతలతో సమాలోచనలు జరిపిన పవన్ తనకు ఏపీలో ఈసారి ఎన్ని తక్కువ సీట్లు వచ్చినా మళ్లీ సినిమాల బాటపట్టను అని.. 2024 వరకు ఏపీలో రాజకీయ తెరపైనే ఉంటానని స్పష్టం చేశారట.. టాలీవుడ్ కు వెళ్లే ఆలోచన ఏదీ లేదని.. తాను డైరెక్టర్లు, నిర్మాతలను కలిసి కథా చర్చలు సాగిస్తున్నానన్న ప్రచారం అబద్దమని నాయకుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. నా పోరు ఇక వచ్చే ఐదేళ్లు ప్రజలతోనేనని పేర్కొన్నాడట..
అందుకే తాను గడ్డం పెంచుకొని రాజకీయ నేత గెటప్ లోనే ఉంటున్నానని.. హీరోగా చేయాలనుకుంటే స్మార్ట్ గా స్టైలిష్ లుక్ లోకి మారుపోదును కదా అని నేతల వద్ద సెటైర్ వేసినట్టు సమాచారం. పవన్ క్లారిటీతో ఆయన సినిమాల్లోకి వెళుతాడన్న అంచనాలకు జనసేన నేతలు ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలిసింది.