రేణూ కి.. హృదయపూర్వక అభినందనలు: పవన్‌

నటి రేణూ దేశాయ్‌కు నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో పవన్‌కు జోడీగా ‘జానీ’, ‘బద్రీ’ చిత్రాల్లో నటించిన రేణూ 2009లో పవన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 2012లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్‌..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం రేణు రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌లతో ధృవీకరించారు.

ఈ క్రమంలో పవన్‌ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. ‘మిస్‌ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’ అని పవన్‌ ట్వీటేశారు. అయితే రేణూ దేశాయ్‌ను ఉద్దేశించి ‘మిస్‌’ అని పవన్‌ కల్యాణ్‌ సంబోధించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చక్కర్లు కొడుతోంది. రేణూ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్నారు.