రొమాన్స్ కు నో చెబుతోన్న స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ‘జజ్బా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ మాజీ విశ్వసుందరి ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో యంగ్ హీరో రణబీర్ కపూర్ తో రొమాన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ విషయం పట్ల బచ్చన్ కుటుంబం ఆమెపై గుస్సా అయిందని అప్పట్లో కథనాలను ప్రచురించాయి. అభిషేక్ ఓ ఈవెంట్ లో ఐష్ ను పట్టించుకోకుండా.. వెళ్లిపోవడం ఇదంతా కూడా ఆ సినిమా కారణంగానే అని వార్తలు వచ్చాయి. దీంతో ఇకపై ఐష్ రొమాన్స్ విషయంలో ఖచ్చితంగా లిమిట్స్ పెడుతుందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఐష్ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఫ్యాన్నే ఖాన్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ వంటి నటులతో కలిసి ఐశ్వర్య నటిస్తోంది. కథలో భాగంగా ఐష్, రాజ్ కుమార్ తో కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించాల్సివుందట. అయితే దానికి ఆమె ఒప్పుకోలేదని తెలుస్తోంది. అసభ్యకరమైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేదే లేదని ఆమె వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు దర్శకుడు ఆ సన్నివేశాలను మార్చే పనిలో ఉన్నారట. మొత్తానికి ‘యే దిల్ హై ముష్కిల్’ ఎఫెక్ట్ తో ఐష్ బాగానే అలర్ట్ అయినట్లు ఉంది.