రోహిత్ “ఆటగాళ్లు” ట్రైలర్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నారా రోహిత్‌ త్వరలో “ఆటగాళ్ళు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆటగాళ్లు చిత్రంలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా, జగపతి బాబు ఓ హార్డ్‌కోర్ క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తన భార్యను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న రోహిత్.. తనకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా జగపతిబాబు కనిపించనున్నారు. రోహిత్‌ను దోషిగా నిర్ధారించేందుకు లాయర్ ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటాడు. ఆ కేసు నుంచి బయట పడేందుకు లాయర్ వేసే ఎత్తులను చిత్తు చేసేలా రోహిత్ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. జులై 5న సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.