పవన్ కల్యాణ్ జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఈరోజు (ఆగస్ట్ 11)న పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మరోసారి మండి పడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి.. అన్ని కులాలను చంద్రబాబు మోసం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తన కొడుకు లోకేష్‌కు ఉద్యోగం ఇస్తే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు వచ్చినట్టు కాదని పవన్ అన్నారు. మీరు యువతకు అండగా ఉంటారని వారికి ఉద్యోగాలు కల్పిస్తారని 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపానని పవన్ కల్యాణ్ అన్నారు. మీకు మద్దతిస్తే పవన్ కల్యాణ్ మంచివాడు, దేశభక్తుడు.. మీరు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్ అనుభవం లేని వాడని ఆరోపిస్తున్నారా అని ప్రశ్నించారు. అవును మీకు అనుభవం ఉందనే నాడు మీకు మద్దతిచ్చానని, మీ అనుభవం 15 స్థానాల్లో గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లాకు ఏమీ చేయలేకపోయిందని పవన్ ఆరోపించారు. నాలుగేళ్లలో కనీసం 50 కోట్లు పెట్టి ఓ బ్రిడ్జి నిర్మించలేకపోయారని అన్నారు. వీటిగురించి మాట్లాడుతుంటే మంత్రి పితాని జనసేన పార్టీకి జెండా లేదు.. అజెండా లేదని అంటున్నారని.. ఎవరివల్ల గెలిచామో మరిచిపోయి తిట్టడం బాధాకరమని పవన్ అన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉందని, ఈ అంశాన్ని జనసేన మేనిఫెస్టోలో పెట్టబోతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆడపడుచుల ఆవేదనను అర్ధం చేసుకునే శాసన సభ్యులు లేరని పవన్ అన్నారు. బీజేపీ కూడా తన నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేయండని మోడీగారికి సభా ముఖంగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. కాపులు కూడా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నారని పవన్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలని పవన్ అన్నారు. తాను మనిషిగా పెరిగానని, కులంగా పెరగలేదని, బాధ్యతతో కూడిన ప్రభుత్వాలు ఉండాలన్నదే తన ఆశయమని, నాకు కుల రాజకీయం తెలీదని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ పేదలకు పట్టాలు పంపిణీ చేస్తోంది కానీ, వారికి స్థలాలు చూపించడం లేదని పవన్ అన్నారు. మంత్రి పితానికి జనసేన జెండా, అజెండా తెలియాలంటే చంద్రబాబుని అడగాలని.. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పుట్టింది. ఇప్పుడు సరిచేయకుంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది.. జనసేన పార్టీ సిద్ధాంతం కులాల ఐక్యత.. టీడీపీ, వైసీపీలాగా ఒక్క కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదు.. అన్ని కులాల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. పవన్ కల్యాణ్‌కు ఒక కులం అండగా ఉంటే ఇంతటి వాడయ్యేవాడా అని ప్రశ్నించారు. అన్నికులాల అండతోనే పవన్ కల్యాణ్, జనసేన ఉంది గానీ, ఒక్క కులంతో కాదని ముఖ్యమంత్రి ఈ విషయం మరిచిపోకూడదని హెచ్చరించారు. నాకు కులం, మతం లేదని పవన్ అన్నారు. నేను మనిషిగా పెరిగాను, కులస్థుడిగా కాదని పవన్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలు, కాపుల మధ్య టీడీపీ చిచ్చుపెట్టిందని పవన్ ఆరోపించారు. అగ్ర కులాల్లోని పేదలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సవరణకు జనసేన కట్టుబడి ఉందని పవన్ అన్నారు.