విజయ్‌ దేవరకొండ సొంత దుస్తుల బ్రాండ్ ‘రౌడీ క్లబ్’

అర్జున్‌ రెడ్డి .. ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో యువతకు ఫ్యాషన్‌కు సింబల్‌గా మారిపోయాడు. ఫ్యాషన్‌ మ్యాగజైన్లు విజయ్‌ ఫొటో షూట్‌ కోసం ఎదురుచుస్తూన్నారు. తనకంటూ ఓ విభిన్న స్టెల్‌ను ఏర్పరచుకున్న విజయ్‌ అభిమానుల కోసం విజయ్‌ సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ బ్రాండ్‌కు ‘రౌడీ క్లబ్‌’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో వెల్లడించాడు.

“బస్టాప్‌ వద్ద ఎదురుచూస్తున్నాను. ఇప్పటికీ నాకు నచ్చిన చొక్కా దొరకలేదు. నేనూ మీలాగే రౌడీ” అంటూ ఓ ఫొటోను విడుదల చేయగా, ఈ ఫొటోలో అతను చొక్కా లేకుండా నిలబడి ఉన్నాడు. స్నేహితులను, అభిమానులను ‘రౌడీస్‌’ అని అంటుంటారు. ఇటేవల ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు కూడా రౌడీ అని డిజైన్‌ చేసి ఉన్న సూట్‌నే వేసుకున్నారు.

ఈ రౌడీ క్లబ్‌లో ఎవరైనా చేరవచ్చని పేర్కొంటూ లింక్‌ కూడా పోస్ట్‌ చేశాడు. దీని పై ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. సొంత దుస్తుల బ్రాండ్‌ ప్రారంభిస్తున్న సందర్భంగా జులై 15న సన్‌డౌనర్‌ పార్టీని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేవరకొండ..ట్యాక్సీవాలా, నోటా, గీతా గోవిందం చిత్రాల్లో నటిస్తున్నారు.