విజయ్‌ సేతుపతి సినిమా రీమేక్‌ లో రాజ్‌ తరుణ్‌

హీరో రాజ్‌ తరుణ్‌ ‘రాజుగాడుగా’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాథించిన సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజ్‌ తరుణ్‌. నయనతార, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ‘నానుమ్‌ రౌడీ దాన్’‌. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్‌ తరుణ్.

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ అప్పట్లో ‘నేను రౌడీనే’ అనే పేరుతో తెలుగులోనూ రిలీజ్‌ అయ్యింది. అయితే ఇప్పటికే తెలుగులో రిలీజ్‌ అయిన సినిమా రీమేక్‌తో రాజ్‌ తరుణ్‌ ఏమేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో ‘కాటమరాయుడు’ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలుగులో ‘వీరుడొక్కడేగా’ రిలీజ్‌ అయిన ‘వీరం’ సినిమాను మళ్లీ కాటమరాయుడు పేరుతో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రీమేక్‌ చేశారు. తెలుగులో ‘పోలీస్‌’గా రిలీజ్‌ అయిన ‘తేరి’ సినిమాను కూడా రవితేజ హీరోగా రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.