‘విజేత’ ఆడియో వేడుక

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా మైక్ అందుకున్న అల్లు అరవింద్.. చిరంజీవితో నిర్మించిన ‘విజేత’ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ‘చిరంజీవి గారు అప్పుడు వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఈ కథ ఎందుకు తీయాలని జంధ్యాల గారితో సహా అందరూ చర్చించారు. కానీ ఆయన యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడు అదే తీయొచ్చు కదా ఇలాంటి కథెందుకు అన్నారు. నేను కొంచెం మొండిగా ఇదే కథ సినిమా తీయాలని చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాను. ఆయన నీకు మనసుకు నచ్చింది చేయ్ అన్నారు. కథ విన్నాను బాగుంది. తప్పనిసరిగా యాక్షన్ సినిమానే అవ్వాల్సిన పనిలేదు అని ధైర్యం చెప్పారు. భయం భయంతోనే సినిమా తీశాను. అప్పటి వరకు నా సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లలో కొంత మంది ‘విజేత’ను తీసుకోలేదు. చిన్న ఫ్యామిలీ డ్రామా అనుకున్నారు. కానీ పెద్ద విజయం’ అన్ని అరవింద్ వివరించారు.

అంతటి విజయం సాధించిన ఆ సినిమా పేరుతో ఇప్పుడు మళ్లీ కళ్యాణ్ సినిమా చేస్తుండటం చాలా సంతోషమన్నారు. మెగా అభిమానులు మా వెనుకున్నారన్న ధైర్యంతో ఈ కుటుంబం నుంచి హీరోలు వస్తున్నారని, ఆ నమ్మకంతోనే వాళ్ల టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారని అరవింద్ చెప్పుకొచ్చారు. అటువంటి టాలెంట్ తప్పనిసరిగా కళ్యాణ్‌లో ఉందని పాటలు, క్లిప్పింగ్స్ చూస్తే అర్థమైపోతుందని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని, కళ్యాణ్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని అరవింద్ ఆశించారు.