విజేత నెం.1లో ఉంది..థ్యాంక్స్‌

అగ్ర కథానాయకుడు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా నటిస్తున్నతొలి చిత్రం ‘విజేత’. ఈ చిత్రానికి రాకేశ్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘బుద్ధుడు కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాకే గొప్పవాడయ్యాడు రా! అందుకే నేనూ వెళ్తా’ అంటూ సాగిన ఈ ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. వినోదం, భావోద్వేగం కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘విజేత’ ట్రైలర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నం.1లో ఉందని పేర్కొన్నారు.వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్‌ ‌కె.కె. సెంథిల్‌ కుమార్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. జులై​ 12న ‘విజేత’ ప్రేక్షకుల ముందుకు రానుంది.