విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు రెడ్ స్టార్ మాదాల రంగారావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రజలు, ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్‌లోని మాదాల రవి ఇంటికి తరలించనున్నారు.

మాదాల రంగారావు స్వస్థలం ప్రకాశం జిల్లా మైనంపాడు. 1945 మే 28న జన్మించిన ఆయన నవతరం పిక్చర్స్ బ్యానర్‌లో సినిమాలు నిర్మించారు. మరో కురుక్షేత్రం, నవోదయం, యువతరం కదిలింది, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, స్వరాజ్యం, ఎర్రసూర్యుడు, జనం-మనం, ఎర్రపావురాలు, ప్రజాశక్తి తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 1980-90 మధ్య విప్లవ సినిమాలతో ఆయన సంచలనం సృష్టించాడు. ఈ తరంలో విప్లవ సినిమాలు తీస్తున్న ఆర్.నారాయణ మూర్తికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. 1980లో తీసిన “యువతరం కదిలింది” చిత్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి బంగారు నంది పురస్కారం అందుకున్నారు.