విశాఖ ఎంపీ అభ్యర్థిపై తీవ్ర ఉత్కంఠ..!

ఏపీలోని విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు..? అనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అవకాశమిస్తే పోటీకి రెడీ అంటున్నారు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌. ఇప్పటికే ఆయన కార్యాలయాన్ని కూడా ప్రారంభించి ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. కానీ టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో టీడీపీ నేతల్లో టెన్షన్‌ ప్రారంభమైంది. ఇక్కడి స్థానంలో ఎవరిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం అనేక పేర్లను పరిశీలిస్తోందట.

ప్రతీసారి నియోజకవర్గాన్ని మార్చడం మంత్రి గంటా శ్రీనివాసరావు స్టైల్‌. ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా లేడట. ఈసారి ఆయన విశాఖ నార్త్‌ వైపు నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నాడట. మరోవైపు టీడీపీ ఈయనను ఈసారి ఎంపీగా బరిలోకి దించాలని ఆలోచిస్తోందట.. అయితే ఎంపీగా పోటీ చేయడానికి గంటా రెడీగానే ఉన్న తొలి ప్రాధాన్యత మాత్రం విశాఖ నార్త్‌కే ఇస్తున్నారట. దీంతో గంటాను ఎక్కడి నుంచి పోటీ చేయించాలోనని చంద్రబాబు పరిశీలిస్తున్నారట.

ఇక సబ్బం హరి పేరును కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నాడట. 2009లో సబ్బం హరి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేకున్నా ముఖ్యమంత్రికి సపోర్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో విశాఖ ఎంపీగా అయితే గంటా.. లేకపోతే సబ్బం హరి ఎవరిలో ఒకరికి టికెట్‌ ఇచ్చే ప్లాన్‌ చేస్తోందట టీడీపీ.

ఇక చలసాని శ్రీనివాస్‌ పేరు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉందట. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అయితే ఆయన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలా విశాఖ ఎంపీ కోసం అనేక పేర్లు ఉండడంతోనే అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం అవుతోందని టీడీపీ శ్రేణుల మధ్య చర్చ జోరుగా సాగుతోంది. అయితే చంద్రబాబు మనసులో ఏముందనేది.. టీడీపీ నేతలకు సైతం అంతుచిక్కడ లేదట. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారోనన్న ఉత్కంఠ తీవ్రంగా ఉందట.