విశాఖ జిల్లా సబ్బవరంలో జగన్ పాదయాత్ర

విశాఖ జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నేడు సబ్బవరంలో జరిగిన వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఏపీ మంత్రులు మాత్రం సింగపూర్‌లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే సబ్బవరంలో అంబులెన్స్ లేక ఓ పిల్లాడు చనిపోయిన పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆరోపించారు. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుందామంటే ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారని, పేదవాడు రేషన్ షాపుకు వెళ్తే బియ్యం ఏమీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుందని జగన్ విమర్శించారు. వేలిముద్రలుపడటం లేదని ఆ బియ్యం కూడా కట్ చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు హయాంలో ఇళ్లుఇవ్వడంలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని, పెన్షన్లు రావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితి ఏర్పడిందని జగన్ ఆరోపించారు. గ్రామ గ్రామాల్లో జన్మభూమి కమిటీ మాఫియా కనిపిస్తుందని అన్నారు. కమిటీల పేరుతో ఒక ఊర్లో 10 మందితో మాఫియాను తయారు చేశారని, ఆ మాఫియా చెప్పిందే రాజ్యమన్నట్టు నడుస్తోందని ఆరోపించారు.