విష్ణునే డైరెక్ట్ చేసాడట!

ఇండస్ట్రీలో చాల మంది హీరోలకు మెగాఫోన్ పెట్టుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ కెప్టెన్ చైర్ అలాంటిది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటుంది. ఇప్పటికే కొంత మంది హీరోలు దర్శకులుగా మారి సినిమాలు చేసిన చరిత్ర ఉంది. కొంతమంది సహాయ దర్శకుల స్టేజ్ నుండి హీరోలుగా మారారు. ఈ క్రమంలో మంచు కుటుంబ సభ్యులకు కూడా దర్శకత్వంపై మోజు ఉన్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కి దర్శకత్వం చేయడమంటే చాల ఇష్టం. గతంలో అతడు నటించిన చిత్రాలకు కొరియోగ్రఫీ, కొన్ని యాక్షన్ సన్నివేశాలను తనే డిజైన్ చేసుకున్నాడు.

విష్ణుకి కూడా ఇలాంటి అలవాటు ఉందట. ప్రస్తుతం విష్ణు నటించిన ‘గాయత్రి’,’ఆచారి అమెరికా యాత్ర’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలానే ‘ఓటర్’ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా కోసం విష్ణు దర్శకుడిగా మారిపోయాడని అంటున్నారు. సినిమాలో కొన్ని సీన్లు అమెరికాలో చిత్రీకరించాల్సివుంది. దర్శకుడు కార్తిక్ రెడ్డికి వీసా దొరకకపోవడంతో సదరు సన్నివేశాలను అసిస్టెంట్ డైరెక్టర్ల సహాయంతో విష్ణునే పూర్తి చేసాడని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దర్శకత్వం వహించాలని కోరిక మాత్రం తనకు లేదని విష్ణు చెప్పుకొచ్చాడు.