వైసీపీలోకి ఆనం రాంనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. కండువా కప్పి వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆనం ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో ఆనం చేరికపై వైసీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ విఫలమైందని విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసి ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్టు డ్రామాలాడుతున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.