‘శంభో శంక‌ర‌’ సెన్సార్ పూర్తి

సినీ పరిశ్రమలో చాలా మంది హాస్యనటులు హీరోలుగా మారి రాణిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి షకలక శంకర్ కూడా చేరిపోయాడు. ‘శంభో శంకర’ అనే చిత్రంతో హీరోగా అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ‘శంభో శంక‌ర‌’ ట్రైల‌ర్‌, పోస్టర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గిన చిత్రమిద‌ని సెన్సార్ స‌భ్యులు ప్రశంసించారు. అంతేకాకుండా ఈ చిత్రం సూపర్ హిట్ కావడం ఖాయమని చెప్పారు.

ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్.ఆర్.పిక్చర్స్, ఎస్.కె.పిక్చర్స్ స‌మ‌ర్పణ‌లో వై.ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెన్సార్ బోర్డు నుంచి ప్రశంసలు అందిన తరవాత నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పటికే టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. దిల్‌రాజు వంటి అగ్రనిర్మాత ఈ సినిమా టీజ‌ర్‌ని ప్రశంసించ‌డం మా అదృష్టం. ఇప్పుడు సెన్సార్ బృందం అంతే గొప్పగా ప్రశంసించింది. సెన్సార్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప‌రిశ్రమ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పారు.

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్రయ‌త్నమిది. తొలి ప్రయ‌త్నంతోనే విజయం సాధిస్తాడనే ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్రశంసించింది. గ్రూప్‌లో ఒక స‌భ్యుడు ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్టర్ మూవీ ఇది అని ప్రశంసించారు. శంక‌ర్ కెరీర్‌కి ఉప‌క‌రించే చిత్రమిది.

శంకర్‌ తో పాటు న‌టీన‌టులంతా అద్భుతంగా న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రికీ కీల‌క‌మ‌లుపునిచ్చే చిత్రమవుతుంది’ అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ‘జబర్దస్త్’ లో శంకర్‌తో పాటు కామెడీ పండించిన అతని మిత్రుడు శ్రీధర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు.