శ్రీనివాస్‌ రెడ్డి ‘జంబలకిడి పంబ’

కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి హీరోగా వస్తున్న మరో చిత్రం ‘జంబలకిడి పంబ’ ఈ చిత్రంలో శ్రీనివాస్‌ రెడ్డి సరసన సిద్ది ఇదానీ కథానాయిక గా నటిస్తోంది. జేబి మురళీ కృష్ణ (మను) దర్శకత్వం మహిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, పోసాని, సత్యం రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ అందరకీ గుర్తుండే ఉంటుంది. ఈ స్థాయిలోనే ఇందులోనూ హాస్యాన్ని పండించారు. రాత్రి ఓ మేటర్‌ జరిగిందిలే అంటూ హీరోయిన్‌ చెప్పడంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం కితకితలు పెట్టేలా ఉంది. శ్రీనివాసరెడ్డి మెయిన్‌ హైలైట్‌గా నడిచిన ఈ ట్రైలర్‌లో ‘దమ్ము ఉండాల్సింది బిర్యానీలో కాదురా..నీలో’ వంటి డైలాగ్స్‌ కూడా పడ్డాయ్‌. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ , పోసాని కృష్ణమురళి పలికే సంభాషణలు కితకితలు పెడుతున్నాయి. మరి వెండితెరపై ఈ సినిమా ఎన్ని నవ్వులు పంచుతుందో చూడాలి. శ్రీనివాసరెడ్డి అమ్మాయిలా ప్రవర్తిస్తూ వయ్యారాలు పోవడం కడుపుబ్బా నవ్విస్తోంది.

శివమ్‌ సెల్యులాయిడ్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రవి, జోజో జోస్‌, ఎన్‌ శ్రీనివాసరెడ్డిలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం సమకూర్చారు.