సంజు బిచ్చమెత్తుకున్నాడా!

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనకు తెరపై కన్పించిన సంజయ్‌ వేరు. నిజ జీవితంలోని సంజయ్‌ వేరు. సంజయ్‌ నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఆ తర్వాత మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, అక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలతో జైలులో శిక్ష అనుభవించడం జరిగాయి. సగటు ప్రేక్షకుడిగా మనకు సంజయ్‌ గురించి తెలిసింది ఇంతే. కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందంటూ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజ్‌కుమార్‌ హిరాణీ. సంజు టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ట్రైలర్‌లో రణ్‌బీర్‌ కన్పించలేదు అంటూ అందరూ ప్రశంసించారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త పోస్టర్‌ను దర్శకుడు హిరాణీ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రణ్‌బీర్‌ రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నట్లు కన్పించారు.

మాదకద్రవ్యాలకు అలవాటుపడిన సంజయ్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఓసారి అక్కడి రిహాబ్‌ సెంటర్‌ నుంచి సంజయ్‌ పారిపోయి తన స్నేహితుల ఇళ్లకు వెళ్లడానికి అక్కడి రోడ్లపై డబ్బుల కోసం బిచ్చమెత్తుకున్నట్లు పోస్టర్‌పై రాసుంది. ఈ పోస్టర్‌ను హిరాణీ ట్విటర్‌ ద్వారా విడుదల చేస్తూ..సంజు జీవిత ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. కొన్ని విషయాలు నమ్మలేని విధంగా ఉంటాయి. సంజు కథ తెలిస్తే నమ్మలేరు కానీ ఇది నిజమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సంజయ్‌ తల్లి నర్గిస్‌ పాత్రలో మనీషా కొయిరాలా, సంజయ్‌ తండ్రి సునీల్‌దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటిస్తున్నారు. సోనమ్‌ కపూర్‌, దియా మీర్జా, అనుష్క శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్‌ 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.