సమంత ఔదార్యం

సౌత్‌లో అగ్ర తారగా ఓ వెలుగు వెలుగుతున్న సమంత హీరోయిన్‌గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా తనేంటో ఇప్పటికే నిరూపించుకుంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అందరిలాగే సంపాదన మీదే దృష్టి పెట్టింది. కానీ తల్లి కోరిక మేరకు 2012లో నలుగురికి సాయపడాలనే ఉద్దేశంతో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తోంది.

గత ఏడాది నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టింది సమంత. అప్పటి నుంచి మరింత బాధ్యతగా మసులుతోంది. ఓ పెద్ద కుటుంబంలో సభ్యురాలిగా ఎంతో హుందాగా వ్యవహరిస్తోంది. తోటి వారికి సాయం చేయడంలో ముందుండే సమంత.. తమ కుటుంబం వంద మంది చిన్నారులకు ఈ ఏడాది మొత్తం ఒక పూట భోజనం అందిస్తున్నట్టు తెలిపింది. ‘అక్షయపాత్ర’ ద్వారా చిన్నారులకు భోజనం పెడుతున్నామని చెప్పిన సమంత మీరు కూడా మీ వంతుగా సాయం చేయాలని ఫ్యాన్స్‌కి పిలుపునిచ్చింది. కేవలం రూ.950లతో ఒక స్కూల్ విద్యార్థికి ఏడాది మొత్తం రుచికరమైన పోషకాహారాన్ని అందించొచ్చని తెలిపింది. సమంత ఇచ్చిన పిలుపునకు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. తమ వంతుగా సాయం అందిస్తున్నారు