సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది

నేచురల్‌ స్టార్‌ హీరో నాని సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని అన్నారు. కూల్‌గా కనిపించే నాని ఇటీవలే నటి శ్రీరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై విమర్శలపై ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డికి నాని లీగల్‌ నోటీసులు పంపించారు. సోషల్‌ మీడియాలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తుందంటూ శ్రీరెడ్డికి నాని నోటీసులు పంపారు. పరువు నష్టం కింద శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చామని, ఏడు రోజుల్లోగా సిటీ సివిల్‌ కోర్టుకు హాజరై ఆమె చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాని తరఫు న్యాయవాదులు సూచించారు.

తనపై వస్తున్న ఆరోపణలపై సోషల్‌ మీడియాలో స్పందిస్తూ నాని ట్వీట్‌ చేశారు. ‘ప్రతి చిన్న విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఆరోపణలు చేసిన వాళ్లు అడిగే ప్రతి అంశం పై బదులివ్వడం నాకిష్టం లేదు. లీగల్‌ ప్రొసీజర్‌ మొదలుపెట్టాం. పరువునష్టం కింద నోటీసులు పంపించా. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నా సమయాన్ని వృథా చేయవద్దు నా విషయంలో నేను ఆందోళన చెందడం లేదు. అందరికీ కుటుంబాలుంటాయి. ఇలాంటి తప్పుడు ఆరోపణలను, వార్తలను వ్యాప్తి చేయకపోవడం మంచిది. నేను దీనిపై మరోసారి కామెంట్‌ చేయదలుచుకోలేదంటూ’ నాని చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. నానికి మద్దతుగా నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

“నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతి త్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే”అని శ్రీ రెడ్డి ఇటీవల పోస్ట్‌ చేయడం టాలీవుడ్‌లో దుమారం రేపిన విషయం తెలిసిందే.