సిల్లీ ఫెలో నరేష్‌కి హ్యాపీ బర్త్‌డే: వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు 25వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఇటీవల డెహ్రాడూన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాని దీనిపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజు (శనివారం) నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా వంశీ పైడిపల్లి ట్విట్టర్‌ ద్వారా శుభాకంక్షలు తెలిపారు. ‘మా ‘రవి’కి హ్యాపీ బర్త్‌డే. నీతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని మహేశ్‌ 25వ చిత్ర బృందం కోరుకుంటోంది’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అల్లరి నరేష్‌ మరోపక్క ‘సిల్లీ ఫెలోస్‌’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. సునీల్‌ ఇందులో మరో కథానాయకుడు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.


పుట్టినరోజు సందర్భంగా అల్లరి నరేష్‌ తన కుమార్తె అయానా ఇవికాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘నా పుట్టినరోజు కానుక.. ఎప్పుడూ.. ఇకపై ఎప్పటికీ’ అని రాశారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా నరేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెప్పారు. ‘నరేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం గొప్పగా ఉండాలి’ అని నేచురల్‌ స్టార్‌ నాని ట్వీట్‌ చేశాడు.