సీనియర్ నటుడు వినోద్‌ కన్నుమూత

టాలీవుడ్ సీనియర్‌ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు బ్రెయిన్‌స్ర్టోక్‌తో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. తెలుగులో
ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా అందరికీ సుపరిచితం. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు.

నటుడు వినోద్‌కు భార్య వీనావతి, పిల్లలు శిరీష, సురేష్‌, తేజస్విలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలిపింది.