సెలబ్రిటిలకు నిద్ర లేకుండా చేస్తున్న సోషల్‌ మీడియా

ఈ రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి సోషల్‌ మీడియా మంచి వేదిక. కానీ ఇందులో వైరల్‌ అవుతున్న గాసిప్స్‌ సెలబ్రిటీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నమ్మశక్యంకానీ వార్తలు ట్రెండింగ్‌ అవుతున్నాయి. కల్పిత వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫలానా హీరో ఫలాన హీరోయిన్‌ మధ్యలో వ్యవహారం నడుస్తోంది అనే గాసిప్స్‌ మాత్రమే కాక కొత్తగా సెలబ్రిటీల కాపురాల్లో చిచ్చు పెట్టే వార్తలు సైతం ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఎలా పుట్టిస్తున్నారో కానీ వార్తలు సృష్టించే వారి కథనాలు నిజమేనా అనిపించేలా ఉంటున్నాయి. సోషల్‌ మీడియా వార్తల వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసందర్భాల్లో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా నటుడు మంచు మనోజ్‌ విషయంలో ఇదే జరిగింది. భార్య ప్రణతితో విభేదాలు ఉన్నాయని, ఆమెతో విడాకులు తీసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నా గుండె ఆగిపోయేంత వరకు ప్రణతి నాతోనే ఉంటుందని అన్నారు.

ఇక దర్శకుడు క్రిష్‌, రమ్య దంపతులు విడిపోతున్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య విభేదాలకు ఓ హీరోయిన్‌ కారణం అంటూ ఆమె పేరును సైతం ఉదహరించేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వార్తలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. జూ. ఎన్టీఆర్‌తో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని, వీరిమధ్య మాటలు లేవనే వార్త ఈ మధ్య షికారు చేసింది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జూ. ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇందులోనే హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి నటిస్తున్నారు. తన ప్రమేయం లేకుండా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఇటీవల ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌తో తను తీసుకున్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇంకా పలువురు ఆర్టిస్టులు తమ వ్యక్తిత్వానికి, కెరీర్‌కు డ్యామేజ్‌ జరిగే పోస్టింగ్‌ల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.