‘సైరా’లో సుదీప్‌ అవుకు రాజు లుక్‌..!

టాలీవుడ్‌ ప్రముఖ కథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్య చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. కాగా, ఇందులో కన్నడ నటుడు సుదీప్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం సుదీప్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా’ లో ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘మా అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్‌నకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సైరా నరసింహారెడ్డిలోని ‘అవుకురాజు’ డైనమిక్‌ లుక్‌ మీకోసం’ అని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సుదీప్‌ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో సుదీప్‌ అవుకు రాజు అనే పాత్రలో నటిస్తున్నారు. నల్లని దుస్తులు ధరించిన సుదీప్‌ కోర మీసాలు, గడ్డంతో పాటు కుడి భుజంపై గొడ్డలి, ఎడమవైపు ఒరలో కత్తితో ఓ వీరుడిలా నిలబడ్డారు. అయితే, ఆయన పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలి.

ఇక ఈ సినిమాలో చిరంజీవికు జోడీగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌.. చిరుకు గురువుగా కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్‌ తదితర భాషల్లో సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.