సొనాలీ బింద్రే కు క్యాన్సర్‌

ప్రముఖ నటి సొనాలీ బింద్రే అభిమానులకు ఇది చేదు వార్త. ఈ విషయాన్ని సొనాలీ బింద్రే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని సొనాలీ ఈ రోజు (బుధవారం) వెల్లడిస్తు.. ‘కొన్ని సార్లు జీవితం నుంచి తక్కువగా ఆశిస్తుంటాం. జీవితం మలుపులతో కూడిన పరీక్షలాంటిది. నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. నిజానికి దీన్ని మేం ఏ మాత్రం ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలవడానికి వచ్చి పోతున్నారు. అత్యుత్తమ ఆదరణను నాకు అందిస్తున్నారు. ఇలాంటి వారు నా చుట్టూ ఉండటం నా అదృష్టం’

‘వ్యాధిని గుర్తించారు కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవడమే సరైన మార్గం. నా వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడు మేమంతా సానుకూలంగా ఆలోచించి, ఈ మార్గంలో అడుగడుగూ పోరాడాలి. గత కొన్ని రోజులుగా నా వాళ్లు నాపై కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులే నా బలంగా పోరాడుతాను’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.సొనాలీ తెలుగులో ‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’ ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ పలు చిత్రాల్లో నటించారు.