హరికృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్‌

ప్రముఖ సినీనటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపంగా తమ పార్టీ కార్యక్రమాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి, నటులు నందమూరి హరికృష్ణ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకున్నాను. ఈలోగానే విషాద వార్త వినాల్సి వచ్చింది. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలి. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. హరికృష్ణ మృతికి సంతాపసూచకంగా ఈ రోజు జనసేన కార్యాలయంలో కార్యక్రమాలను రద్దు చేస్తున్నాం’ అని పవన్‌కల్యాణ్‌ ప్రకటన ద్వారా తెలిపారు.