హాస్య నటుడి మృతికి ప్రముఖుల నివాళులు!

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కొద్ది గంటల క్రితం మృతి చెందారు. గత
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న హనుమంతరావు ఈరోజు ఉదయం ఎస్.ఆర్.నగర్ లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 200 ల సినిమాల్లో నటించిన ఆయన ఆరోగ్యం బాగాలేని కారణంతో సినిమాలకు దూరమయ్యారు. ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ పెద్దలు నివాళులు అర్పిస్తున్నారు. కమెడియన్ బ్రహ్మానందం.. హనుమంతరావు భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ వార్త వినగానే నేను నమ్మలేదు, కొంత అలజడికి లోనయ్యాను. తనకున్న మంచి మిత్రుల్లో హనుమంతరావు ఒకరు అని తెలిపారు. శివాజీ రాజా, నేను, గుండు సరదాగా ఉండేవాళ్ళం అని అన్నారు. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేనటువంటి నటుడు గుండు హన్మంతరావు. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. గుండు హనుమంతరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధించారు బ్రహ్మానందం’.