హ్యాపీ యానివర్సరీ-అఖిల్‌

టాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ జంట అక్కినేని నాగార్జున-అమల పెళ్లి రోజు నేడు. వీరిద్దరి వివాహమై నేటికి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజును కుంటుంబంతో కలిసి ప్రత్యేకంగా జరుపుకోవాలనుకున్నారు. అక్కినేని కుటుంబీకులంతా కలిసి విందులో పాల్గొన్నారు. ఈ ఫొటోలను అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘లవ్‌ బర్డ్స్‌’ కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తూన్నాను. నేనెంతో ప్రేమించే నా ప్రియమైన తల్లిదండ్రులకు హ్యాపీ యానివర్సరీ. ఎంత గొప్ప ప్రేమకథో’ అని ట్వీట్‌ చేశారు. విందులో నాగార్జున, అమల, నాగచైతన్య, సుశాంత్‌, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు. కానీ అక్కినేని పెద్ద కోడలు సమంత మాత్రం కన్పించలేదు. దాంతో అభిమానులు ఈ ఫొటోలో సమంత ఉన్నట్లు సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఫొటో ఎడిట్‌లపై సమంత ట్విటర్‌ ద్వారా స్పందించారు.

నాగ్‌ కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచిన ‘శివ’ చిత్రీకరణ సమయంలో నాగ్‌, అమల ప్రేమించుకున్నారు. 1992లో వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత అమల సినిమాలు మానేసి కుటుంబానికే తన సమయాన్ని కేటాయించారు. 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రంలో అమల హీరో తల్లిగా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన ‘మనం’ చిత్రంలో అతిథి పాత్రలో కన్పించారు. మరోపక్క నాగర్జున..ఇటీవల ‘ఆఫీసర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది ప్రస్తుతం నాగ్‌..శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాని మరో కథానాయకుడిగా నటిస్తున్నారు