‘2.O’ లీక్ పై వర్మ కామెంట్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సంచలన దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.ఓ (2.O). ఈ చిత్రం ఆడియోను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించారు. దీంతో ఈ టీజర్ కోసం కోట్లాది మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రజనీతో పాటు యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియో తాజాగా లీక్ అయింది. ఇదే టీజర్ లీక్ అంటూ సినిమాలో కొన్ని దృశ్యాలు ఆదివారం ఉదయం విడుదల కావడం చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది.
 ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే టీజర్‌ విడుదలకు ముందే కొన్ని సన్నివేశాలు లీకవడం బాధాకరం. దీనిపై ఇప్పటికే రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీజర్‌ లీక్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. టీజర్‌ లీకైనప్పటికీ అందులోని సన్నివేశాలు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయని అన్నారు. ‘ఏదో కారణం చేత ‘2.O’ టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు లీకయ్యాయి. అయినప్పటికీ ఆ సన్నివేశాలు దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి’ అని తనదైన శైలిలో వర్మ ట్వీట్‌ చేశారు.