21 నుంచే వైసీపీ క్యాంపింగ్ షురూ..

అన్నీ సర్వేలు వైసీపీ వైపే.. అన్ని అంచనాలు ప్రతిపక్ష నేత జగన్ గెలుపుపైనే.. దీంతో ఏపీలో ఇప్పుడు సరికొత్త వాతావరణం నెలకొంది. అమరావతి కేంద్రంగా జగన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను ఇప్పటికే ఖాళీ చేయించారు. అమరావతికి షిఫ్ట్ అవుతున్నారు.

జగన్ ఏపీకి వచ్చేయడంతో వైసీపీలో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల ఫలితాలపై ధీమా వ్యక్తం అవుతోంది. దీంతో వైసీపీ వ్యూహం మార్చేసింది. కౌంటింగ్ కు ముందే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర ముఖ్యలు అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది.

అమరావతిలోనే జగన్ తన నివాసాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. అమరావతికి 10 కి.మీల దూరంలో నిర్మించిన ఈ హౌస్ ఫిబ్రవరి 27న గృహ ప్రవేశం జరిగింది. ఇక ఏపీ పాలిటిక్స్ అంతా జగన్ అమరావతి నుంచే మెయింటేన్ చేస్తాడన్న చర్చ సాగుతోంది.

మే 23న ఫలితాల తర్వాత గెలిస్తే జగన్ తన నివాసాన్నే సీఎం క్యాంప్ ఆఫీస్ గా మారుస్తాడన్న చర్చ సాగుతోంది. ఇక్కడి నుంచే నవ్యాంధ్రను పాలిస్తారని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే 21వ తేదీనే అన్ని నియోజకవర్గాల్లో నిలబడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు అమరావతికి రావాలని జగన్ ఆదేశించారు. 22న పూర్తి స్థాయిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడు.