Tollywood Sequels:
బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ వర్క్ అయినట్లు టాలీవుడ్ చరిత్రలో చాలా తక్కువసార్లు మాత్రమే ఉంది. సీనియర్ హీరోల నుంచి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల దాకా చాలామంది తమ బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ తీశారు కానీ ఆ సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
మూడు దశాబ్దాల ముందు వర్మ తీసిన మనీ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మనీ మనీ డిజాస్టర్ అవడం నుంచి ఈ సెంటిమెంట్ మొదలైంది. శంకర్ దాదా ఎంబిబిఎస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్, గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ కి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, రవితేజ నటించిన కిక్ 2, మన్మధుడు లాంటి క్లాసిక్ సినిమాకి సీక్వెల్ అయిన మన్మధుడు 2 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలానే సినిమాలు ఉన్నాయి.
కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అది కార్తికేయ కథకి కంటిన్యూషన్ కాదు. కే జి ఎఫ్ 2, బాహుబలి 2 సినిమాలు రెండవ భాగాలుగా విడుదలయ్యాయి తప్ప సీక్వెల్ గా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది డైరెక్టర్లు కూడా తమ సినిమాలకి సీక్వెల్స్ తీయాలని అనుకోవడం లేదు. రాజమౌళి కూడా బాహుబలికి సీక్వెల్ తీసే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారు.
అయితే 2024లో మాత్రం సిద్దు జొన్నలగడ్డ హీరోగా బ్లాక్ బస్టర్ సినిమా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సీక్వెల్స్ మళ్లీ తెలుగులో వర్క్ అవుతున్నాయా అని కొందరిలో ఆశలు కూడా చిగురించాయి. మళ్లీ సీక్వెల్ తీసిన హిట్ అందుకోవచ్చేమో అని డైరెక్టర్లలో మళ్లీ ఆలోచనలు కూడా వచ్చాయి.
కానీ ఈ మధ్యనే శంకర్ దర్శకత్వంలో విడుదలైన భారతీయుడు 2 ఆ ఆశలు అన్నిటినీ ఒకేసారి ఆరిపోయేలా చేసింది. 28 ఏళ్ల తర్వాత భారతీయుడు వంటి కల్ట్ సినిమాకి సీక్వెల్ గా వచ్చి డిజాస్టర్ అయ్యే దిశగా పరుగులు తీస్తోంది. వారాంతం పూర్తవ్వకుండానే రోజురోజుకీ కలెక్షన్లు తగ్గిపోతూ వచ్చాయి. ఇక భారతీయుడు 2 సినిమా కలెక్షన్లు పెరగడం ఆసాధ్యం. సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీంతో ఏడాది మొదట్లో టిల్లు స్క్వేర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో.. కొంతమంది డైరెక్టర్లు సీక్వెల్స్ వర్క్ అవుతాయేమో అని ఆలోచన చేసినప్పటికీ.. ఇండియన్ 2 సినిమా రిజల్ట్ మాత్రం.. ఆ ఆలోచనలన్నిటిమీద.. ఒకేసారి నీళ్లు చల్లేసినట్టు అయింది.