Homeతెలుగు Newsఅందుకే మోడీని కౌగిలించుకున్నా: రాహుల్‌

అందుకే మోడీని కౌగిలించుకున్నా: రాహుల్‌

9 19
పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీని కౌగిలించుకోవడానికి గల కారణాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బయటపెట్టారు. ద్వేషానికి ప్రేమే సమాధానం అని అందుకే అలా చేసినట్లు ఆయన తెలిపారు. శనివారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ తన నానమ్మ, తండ్రి కూడా దాడులు కారణంగానే చనిపోయారని అన్నారు.

‘దాడుల కారణంగా నేను ఇద్దరు కుటుంబసభ్యులను పోగొట్టుకున్నాను. ఆందోళనలు ఎంతమాత్రం పని చేయవని నేను భావిస్తాను. ద్వేషాన్ని ఒక్క ప్రేమ మాత్రమే జయించగలదు’ అని అన్నారు. అనంతరం పార్లమెంటులో మోడీని కౌగిలించుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘పార్లమెంటులో ప్రధాని మోడీని నేను కౌగిలించుకున్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతారని నాకు తెలుసు. అసలేం జరుగుతుందో ఆయనకు అర్థం అయి ఉండదు. ఆయన జీవితంలో ప్రేమ లేదని నాకు అనిపించింది’ అని ఆయన చెప్పారు. తన కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల ప్రేమ వ్యక్త పరచాలనే ఉద్దేశంతో అలా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. గతేడాది లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ ప్రసంగించిన అనంతరం వెళ్లి మోడీని కౌగిలించుకున్న విషయం తెలిసిందే. తర్వాత తన సీటులోకి వచ్చి కూర్చున్న రాహుల్‌ పక్కనే ఉన్న కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడుతూ కన్నుకొట్టారు. అప్పట్లో ఇది వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu