HomeTelugu Reviews'LGM' రివ్యూ

‘LGM’ రివ్యూ

LGM Review

క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సొంత బ్యానర్‌లో వస్తున్న మొదటి సినిమాగా తమిళంలో ‘LGM’ సినిమాను నిర్మించాడు. ఆయన భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాణ వ్యవహారాలను చూస్తూ వచ్చింది. తమిళంలో క్రితం నెల 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగులో ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీశ్ కల్యాణ్ – ఇవాన ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాకి రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం..

గౌతమ్ (హరీశ్ కల్యాణ్) బాల్యంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి (నదియా) అతనికి ఏ లోటు తెలియకుండా పెంచుతుంది. అతను బాగా చదువుకుని ఓ పెద్ద సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు. అదే సంస్థలో పనిచేస్తున్న మీరా (ఇవాన)తో ప్రేమలో పడతాడు. రెండేళ్లపాటు డేటింగ్ చేసిన తరువాత పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని మీరా అంటుంది. అందుకు అతను అంగీకరిస్తాడు. అలా రెండేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత అతనితో పెళ్లికి మీరా తన అంగీకారాన్ని తెలియజేస్తుంది.

ఈ రెండేళ్లుగా తల్లి ఎన్నిసార్లు పెళ్లి మాట ఎత్తినా ఆ మాటను దాటవేస్తూ వచ్చిన గౌతమ్, ఆ తరువాత అసలు విషయం తల్లితో చెబుతాడు. మీరా ఇంట్లో పెళ్లి మాటలకు ఏర్పాట్లు జరుగుతాయి. గౌతమ్ తల్లి మాటలను బట్టి, అతనితో తన పెళ్లి తరువాత ఆమె తమ దగ్గరే ఉంటుందనే విషయం మీరాకి అర్థమవుతుంది. దాంతో ఆమె గౌతమ్ ను పక్కకి తీసుకుని వెళ్లి మాట్లాడుతుంది. తమ పెళ్లి తరువాత అతని తల్లి తమతోనే ఉండే విషయాన్ని గురించి తాను ఆలోచన చేయలేదనీ, తనకి కొంత సమయం కావాలని అడుగుతుంది.

దాంతో తన తల్లిని తీసుకుని గౌతమ్ సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి మీరా కుటుంబ సభ్యుల పట్ల గౌతమ్ తల్లి కోపంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో గౌతమ్ బాగా హర్ట్ అయ్యాడని తెలిసిన మీరా, అతణ్ణి కాస్త కూల్ చేస్తుంది. తమ పెళ్లికి ముందే అతని తల్లి .. తాను ఒకరినొకరం అర్థం చేసుకోవాలనీ, లేదంటే భవిష్యత్తులో గొడవలు అవుతాయని అంటుంది. తన ఫ్యామిలీ .. అతని ఫ్యామిలీ కలిసి ఒక టూర్ ప్లాన్ చేద్దామనీ, అలా చేయడం వలన రెండు కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది.

ముఖ్యంగా కాబోయే అత్తగారికి తన గురించీ, ఆమె గురించి తనకి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతుంది. ఇలాంటి ఒక ఒప్పందానికి తన తల్లి ఒప్పుకోదనే విషయం గౌతమ్ కి తెలుసు. అందువలన అతను అసలు సంగతి దాచేసి, ఆఫీస్ వారు ఏర్పాటు చేసిన ట్రిప్ అంటూ, మీరా ఫ్యామిలీ ట్రిప్ లో తన తల్లి జాయిన్ అయ్యేలా చేస్తాడు. ఆ జర్నీలో కాబోయే అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ.

ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ ద్వారానే స్టోరీ లైన్ ఏమిటనేది చెప్పేశారు. సాధారణంగా పెళ్లికి ముందు ఒకరిని గురించి ఒకరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజుల్లో డేటింగ్ చేయడం సహజమైపోయింది. అలాగే కాబోయే అత్తాకోడళ్లకి కూడా ఒకరిని గురించి ఒకరికి ముందుగానే తెలియాలనే ఈ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది .. ఆసక్తిని రేకెత్తించింది. దాంతో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ కావడం ఖాయమని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది.

దర్శకుడు అనుకున్న కథను స్రీన్‌పై చూపించలేకపోయ్యాడు. ఈ కథ, హీరో, అతని తల్లి, ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. కథ మొదలు కాగానే తమ మధ్య రెండేళ్లుగా లవ్ నడిచిందని హీరో నోటి మాటగా చెబుతాడు. అప్పటి నుంచి పెళ్లికి సంబంధించిన టెన్షన్ మొదలవుతుంది. ఇక్కడే యూత్ సగం నీరు కారిపోతుంది. ఇక ఫస్టాఫ్ అంతా కూడా హీరో ఇల్లు, ఆఫీస్, క్యాంటీన్, పెళ్లి గురించిన మాటలు తప్ప, ఏమీ జరగదు. టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగును కలిగించారు. ఆ టైమ్‌లో యోగిబాబు ఎంట్రీ ఇవ్వడంతో ఇక ఇక్కడి నుంచి అన్నీ నవ్వులే అనుకుంటాడు. సెకాండాఫ్ మొదలైన కాసేపటికే .. ఫస్టాఫే బాగుంది అనిపిస్తుంది.

హీరో హరీశ్ కల్యాణ్, హీరోయిన్ ఇవానా, నదియా , యోగిబాబు ఎవరి పాత్ర పరిధిలో వారు నటించారు. ‘లవ్ టుడే’లో తన లుక్ తో కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేసిన ఇవాన, ఈ సినిమాలో అంతగా గ్లామరస్ గా కనిపించలేదు. కథాకథనాలు .. పాత్రలు మాత్రమే కాదు, పాటలు కూడా బలహీనంగానే ఉన్నాయి. సంగీతం అందించింది కూడా దర్శకుడే కావడం విశేషం.

టైటిల్‌ : LGM
నటీనటులు: హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు
నిర్మాతలు: సాక్షి ధోని,
వికాస్ హసీజా
దర్శకత్వం &సంగీతం: రమేష్ తమిళమణి

చివరిగా: ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే చిత్రం ‘LGM’

Recent Articles English

Gallery

Recent Articles Telugu