మురుగదాస్‌ కోసం పారితోషికం తగ్గించుకున్న రజనీకాంత్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన కొత్త సినిమాకు పారితోషికం తగ్గించుకున్నారట. ‘పేట’ సినిమా తర్వాత తలైవా మురుగదాస్‌ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే దీనికి రజనీ పారితోషికం తగ్గించుకున్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌లో రూపొందించిన ‘2.ఓ’ సినిమా బిజినెస్‌ దీనికి కారణమని చెబుతున్నారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. కానీ.. నిర్మాతలు ఊహించిన లాభం తెచ్చిపెట్టలేదని అంటున్నారు. ‘2.ఓ’ కు రజనీ రూ.60 కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. ఈ నేపథ్యంలో నిర్మాతలకు కాస్త ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఇప్పుడు తలైవా ఈ సినిమాకు పారితోషికం తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజనీ ప్రస్తుతం తన రెండో కుమార్తె సౌందర్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఆమె వివాహ వేడుకలు జరగనున్నాయి. దీని తర్వాత రజనీ కొత్త సినిమా పనుల్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.