శ్రీకారం రివ్యూ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ నటించిన తాజా చిత్రం శ్రీకారం. ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా నేడు(మార్చి 11)న విడుదలైంది. అయితే ఇటీవల రైతు కథాంశం మీద వచ్చిన సినిమాలు తక్కువే. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కర్షకుల చిత్రం ఎలా ఉంది? రైతు బిడ్డగా శర్వానంద్‌ ఏ మేరకు మెప్పించాడు? అనేది చూద్దాం.

కథ: అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి ఆకట్టుకుంటాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్‌ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు నిర్ణయించుకుంటుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ

నటీనటులు: విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్‌ ఎప్పుడు ముందుటాడు. కంప్యూటర్‌ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్‌వేర్‌ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. కార్తిక్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ మెప్పించింది. ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేష్‌ది‌. రావు రమేష్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. సాయి కుమార్‌, ఆమని, నరేశ్‌, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ: చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్‌ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌. ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. కొన్ని డైలాగ్స్‌ యువతను ఆలోచింపజేస్తాయి.

టైటిల్: శ్రీకారం
న‌టీన‌టులు: శర్వానంద్, ప్రియాంకా అరుళ్‌ మోహన్, సాయికుమార్‌, మురళీ శర్మ, రావు రమేశ్‌ తదిరులు
ద‌ర్శ‌క‌త్వం: బి.కిశోర్‌
నిర్మాత‌: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట
సంగీతం: మిక్కీ జె. మేయర్

హైలైట్స్: శర్వానంద్‌ నటన
డ్రాబ్యాక్స్: స్లో నేరేషన్‌
చివరిగా: మంచి సందేశాత్మక కథ
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

CLICK HERE!! For the aha Latest Updates