రంగమ్మత్తకు మెగా ఆఫర్స్!

బుల్లితెరపై యాంకర్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అనసూయ.. వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ‘క్షణం’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. ‘F2’లో ఓ పాటలో నర్తించారు. ‘యాత్ర’ సినిమాలో చిన్న పాత్రలో మెరిశారు. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్ర పోషించిన ‘కథనం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తోన్న అనసూయకు ప్రస్తుతం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. వాటిలో రెండు ‘మెగా’ ఆఫర్లు ఉన్నాయని అంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ‘సైరా’ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమాలో అనసూయకు కొరటాల శివ అవకాశం కల్పించారని తెలుస్తోంది. అనసూయకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను కొరటాల ఆఫర్ చేశారట. ఇంత పెద్ద ప్రాజెక్టులో మంచి రోల్ దక్కడంతో అనసూయ కూడా ఓకే చెప్పేశారని అంటున్నారు. ఈ చిత్రంతో పాటు మరో మెగా హీరో సినిమాలోనూ అనసూయకు అవకాశం దక్కినట్లు సమాచారం.

‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర అనసూయకు ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమె యాక్టింగ్ కెరీర్‌లోనే గొప్ప పాత్ర ఇది. ఇలాంటి పాత్రను తనకు ఇచ్చిన దర్శకుడు సుకుమార్ ఇప్పుడు మరో రోల్‌ను అనసూయ కోసం సిద్ధం చేశారట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఒక సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అనసూయకు ఓ మంచి పాత్రను సుకుమార్ ఆఫర్ చేశారట. దీనికి కూడా అనసూయ పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే!