ముందుగానే రానున్న ‘బాహుబలి2’..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో        ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అనుకున్న  సమయం కంటే ముందుగానే సినిమా రిలీజ్ అవుతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 కంటే ముందే రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి ఓ కారణం ఉంది.. ఇటీవల ఈ సినిమాలో కొన్ని సీన్లను గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన ఓ వ్యక్తి లీక్ చేశాడు. దీంతో బాహుబలి టీం కు లీకేజ్ భయం పట్టింది. సినిమా రిలీజ్ లోపే సన్నివేశాలు ఏ రూపంలోనైనా.. బయటకి వస్తే అది సినిమాపై ప్రభావం చూపిస్తుందేమో అనే భయంతో ముందుగానే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
 
ఫిబ్రవరి నాటికి సినిమా ఫైనల్ కాపీ రెడీ అయిపోతుంది. కాబట్టి వీలైనంత సమయంలో సినిమా ప్రమోషన్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో  రాజమౌళి ఉన్నాడు. ఈ విషయాన్ని నిర్మాతలతో, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అందరూ ఓకే అంటే అనుకున్న దానికంటే ముందుగానే సినిమా థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.