బాలాపూర్‌ లడ్డూ కొత్త రికార్డు

బాలాపూర్ గణేష్ లడ్డూ కొత్త రికార్డు సృష్టించింది.. గత రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది రూ.17,60,000 పలికింది. వేలం పాటతో ప్రత్యేక గుర్తింపు పొందారు బాలాపూర్ గణేష్‌.. ఇక, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఊరేగింపు నిర్వహించి అనంతరం గ్రామంలోని బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహించారు. అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ కార్యక్రమం కోసం యావ‌త్ ప్రపంచం ఎదురు చూస్తుంటోంది. ఈ వేలంపాట‌లో వినాయ‌కుడి ల‌డ్డూను ద‌క్కించుకున్న వారికి వినాయ‌కుడి ఆశీస్సులు నిండుగా ఉంటాయ‌న్నది భ‌క్తుల న‌మ్మకం. అందుకే ప్రతీ ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది బాలాపూర్ గణేష్ లడ్డూ.. ఇక ఈ ఏడాది రూ.17,60,000 పలికింది. కొలను రాంరెడ్డి అనే వ్యక్తి ఈ సారి లడ్డూను దక్కించుకున్నారు.

గ‌తేడాది ఈ ల‌డ్డూను బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16.60 ల‌క్షల‌కు సొంతం చేసుకోగా… 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15.60 ల‌క్షల‌కు సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ వేలం తొలిసారిగా 1994లో ప్రారంభమైంది. కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ ఏడా వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తుంది. ప్రముఖులు సైతం లడ్డూ వేలంలో పాల్గొని లడ్డూను అందుకోవాలని పోటీ పడుతుండడం విశేషం. ఈ లడ్డు పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందని, మంచి జరుగుతుందని వారి నమ్మకం. అందుకే ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.

లడ్డూ వేలం దక్కించుకున్నవారి లిస్ట్:
1994 కొలను మోహన్ రెడ్డి రూ. 450
1995 కొలను మోహన్ రెడ్డి రూ. 4,500
1996 కొలను కృష్ణారెడ్డి రూ.18,000
1997 కొలను కృష్ణారెడ్డి రూ. 28,000
1998 కొలను మోహన్ రెడ్డి రూ. 51,000
1999 కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65,000
2000 కల్లెం అంజిరెడ్డి రూ. 66,000
2001 జి. రఘునందన్ చారి రూ. 85,000
2002 కందాడ మాధవరెడ్డి రూ. 1,05,000
2003 చిగిరింత బాల్ రెడ్డి రూ. 1,55,000
2004 కొలను మోహన్ రెడ్డి రూ. 2,01,000
2005 ఇబ్రం శేఖర్ రూ. 2,08,000
2006 చిగిరింత తిరుపతి రెడ్డి రూ.3,00,000
2007 జి.రఘునందన్ చారి రూ.4,15,000
2008 కొలను మోహన్ రెడ్డి రూ.5,07,000
2009 సరిత రూ.5,10,000
2010 కొడాలి శ్రీధర్‌బాబు రూ.5,35,000
2011 కొలను బ్రదర్శ్ రూ.5,45,000
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7,50,000
2013 తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000
2014 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ.9,50,000
2015 కొలను మదన్‌మోహన్‌రెడ్డి రూ.10,32,000
2016 స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000
2017 నాగం తిరుపతి రెడ్డి రూ.15,60,000
2018 శ్రీనివాస్ గుప్తా రూ.16,60,000
2019 కొలను రాంరెడ్డి రూ.17,60,000